భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు మళ్లీ తిరుగుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. దీంతో సిరియా దేశంలో మళ్లీ హింస చెలరేగి ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియా అంతర్యుద్ధం మొదలైన 14సంవత్సరాల్లో దీన్ని అత్యంత హింసాత్మక, దారుణమై ఘటనగా పేర్కొంటున్నారు.
745మంది సాధారణ పౌరులు:
బ్రిటన్ ఆధారిత సిరియన్ ఆబ్సర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. బషర్ అల్ అసద్ మద్దతుదారులు మొదట ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ప్రతిదాడికి దిగాయి. రెండురోజులు కొనసాగిన ఈ ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా మృతి చెందగా వారిలో 745మంది సాధారణ పౌరులు ఉన్నారు. 125మంది భద్రతా సిబ్బంది, 148మంది అసద్ మద్దతుదారులు కూడా మరణించారు. ఫలితంగా లతాకియా నగర పరిసరాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా పూర్తిగా నిలిపివేశారు.
మత సంఘానికే చెందిన వ్యక్తులపై ప్రతీకార హత్యలు:
తిరుగుబాటుదారులు ఇటీవల సిరియాను ఆక్రమించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు అసద్ కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ..అసద్ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని మట్టుపెట్టాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సున్నీ ముస్లిం గన్మెన్లు, అసద్‌కు చెందిన మైనార్టీ అలవైట్లు మత సంఘానికే చెందిన వ్యక్తులపై ప్రతీకార హత్యలు చేయడం ప్రారంభించారు. తిరుగుబాటుదారులకు సహకరించారనే కోపంతో ఈ చర్యలకు దిగారు.
ఇళ్లకు నిప్పు, వీధుల్లోకి లాక్కొచ్చి ఊచకోత:
అలవైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించి వారి ఇళ్లకు నిప్పంటించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అలవైట్లను వీధుల్లోకి లాక్కొచ్చి ఊచకోత కోశారు. బనియాస్ పట్టణంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలావైట్ల మృతదేహాలు వీధుల్లో, ఇళ్లలో పడి ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వాటిని తీసుకునేందుకు కూడా ఎవ్వరూ సాహసం చేయడం లేదు. చావు భయంతో వేలాది మంది సమీప కొండ ప్రాంతాల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. దాడుల్లో చనిపోయిన ఐదుగురు సిరియా దళ సభ్యులకు శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. సిరియాలోని రామీ అబ్దుర్హమాన్, ఆబ్జర్వేటరీ చీఫ్, ప్రతీకార హత్యలు శనివారం ఉదయం ఆగిపోయాయని చెప్పారు.
ప్రాణభయంతో పారిపోయాం:
బానీయాస్‌లో అలవైట్ కాలనీకి చెందిన దాదాపు 20 మంది పౌరులు హతమైనట్లు ఆ ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల అలీ షేహా తెలిపారు. తమ ప్రాంతంలో హింస ప్రారంభమైన తర్వాత తన కుటుంబం, పొరుగువారితో కలిసి పారిపోయానని పేర్కొన్నారు. ‘ఇది దారుణం. అసద్ మద్దతుదారులు తమ అపార్టుమెంట్ వద్దకు వచ్చి విక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ప్రాణ భయంతో మేము పారిపోయాం. వారు కొంతమందిని హతమార్చి మా ఇండ్లను దోచుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని కథనాలు: