భారత్ సమాచార్, రాజకీయం : కొత్త రేషన్ కార్డులకు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్త కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. వీటి కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీసేవ ద్వారా ఆన్ లైన్ లో ఈ దరఖాస్తులు తీసుకోనున్నారు. అర్హుల ఎంపికను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలుపెట్టనున్నారు. అర్హుల ఎంపికను గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రేషన్ కార్డులతో బియ్యం వంటి సరుకులే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకు ఈ కార్డు ఉండాలనే రూల్ ఉంది. దీంతో రేషన్ కార్డుల కోసం పేద,మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తుంటారు. అయితే చాలా రోజులుగా కార్డులు పంపిణీ చేయకపోవడంతో ఎంతో మంది పేదలు ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై దృష్టి సారించింది. అయితే రేషన్ కార్డుల జారీకి ఇంకా గైడ్ లైన్స్ జారీ చేయలేదు. పాత గైడ్ లైన్స్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు సైతం చేయనున్నట్లు సమాచారం. అలాగే తప్పులను సరిచేయనున్నారు. వీటన్నింటికీ ఈనెల 28నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నాటికే 11.02లక్షల దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో తమ పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని కూడా చాలా మందే కోరారు. కాకపోతే అప్పట్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇక వారందరి సమస్యలు తీరనున్నాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత 6,47,297 రేషన్ కార్డులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.82కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. కార్డుల సంఖ్యను తీసుకుంటే 89.98లక్షలు ఉన్నాయి.
రేషన్ కార్డుల పంపిణీ తర్వాత అనేక ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ఇక స్పీడప్ కానుంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన పలు స్కీంలకు ఈ రేషన్ కార్డులే ప్రధాన అర్హత కానుంది. లక్షలాది పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డులతో లబ్ధి చేకూరనుంది.