భారత్ సమాచార్, జాతీయం ;
ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ ) లో అక్రమాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానం చేసే కార్యక్రమం చేపట్టి చాలా కాలమే అయింది. కానీ ఇంకా కొద్ది మంది కార్డు దారులు ఆధార్ ను రేషన్ కార్డుతో అనుసంధానం చేయలేదు. అటువంటి వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద రేషన్ తీసుకునే లబ్ధిదారులకు రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వం మూడు నెలల గడువును పొడిగించింది. 2024 సెప్టెంబర్ 30 వరకు వినియోగదారులు రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ తాజాగా నోటిఫికేషన్‌లో తెలిపింది. మునుపటి నోటిఫికేషన్‌లో, జూన్ 30, 2024 వరకు దీనికి సమయం ఇచ్చారు. ఫిబ్రవరి 2017లో, పిడిఎస్ కింద ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే, దాని గడువు ఇప్పటి వరకు అనేక సార్లు పొడిగించింది.
నోటిఫికేషన్ ప్రకారం, నిర్ణీత గడువులోగా రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. లేదా ఆధార్ లేని లబ్ధిదారులు దాని కోసం దరఖాస్తు చేసి దాని రుజువును సమర్పించాలి. చాలా మంది పీడీఎస్ వినియోగదారులు ఇప్పటికే తమ రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. అప్పటి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి డిసెంబర్ 20, 2023న లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో, ఇప్పటి వరకు 99.8 శాతం రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానించబడి ఉన్నాయని చెప్పారు.
ఎలా అప్‌డేట్ చేయాలి ?
రేషన్ కార్డ్ E-KYCని పొందడానికి మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసి ఉండాలి. అందులో నమోదు చేసిన బయోమెట్రిక్ వివరాల ప్రకారం రేషన్ కార్డు అప్‌డేట్ చేయబడుతుంది. మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ కాకపోతే మీరు ముందుగా దాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. రేషన్ కార్డు E-KYC కోసం మీరు రేషన్ పొందే దుకాణానికి వెళ్లాలి. అయితే మీరు రేషన్ కార్డు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేక సైట్‌ను రూపొందించారు. మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీరు రేషన్ కార్డు సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. దీని తరువాత సభ్యులందరూ వెళ్లి బయోమెట్రిక్ ప్రకారం E-KYC చేయించుకోవాలి.