భారత్ సమాచార్.నెట్: కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లును ఉపసంహరించుకుంది. ఈ బిల్లును అప్‌డేట్ చేసి మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆదాయపు పన్ను బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. సెలెక్ట్ కమిటీకి పంపింది.
అయితే జూల్ 21న సెలెక్ట్ కమిటీ పార్లమెంట్‌కు తమ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో 285 ప్రతిపాదనలు చేసింది కమిటీ. ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. వాటి ఆధారంగా కొత్త బిల్లును రూపొందించేందుకు రెడీ అవుతోంది. ఈ అప్‌డేటెడ్ బిల్లును ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ సవరించిన ఆదాయపు పన్ను బిల్లులో.. ఇంటిపై ఆదాయం పొందుతున్న వారికి ఉపశమనం కలిగించే విధంగా కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. సొంత ఇంటిని అద్దెకు ఇచ్చిన సందర్భాల్లో కూడా వడ్డీపై పన్ను మినహాయింపు కల్పించాలని కమిటీ సూచించింది. అదనంగా టీడీఎస్, టీసీఎస్ రీఫండ్లను సులభతరం చేయాల్సిన అవసరం ఉన్నదని కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.