భారత్ సమాచార్, అమరావతి ; గత నెల మొదటి వారం అంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా పెన్షన్ల పంపిణీ చుట్టూనే తిరిగాయి. అధికార పక్షం, ప్రతి పక్షం, ఎన్నికల కమిషన్, రాష్ట్ర హైకోర్టు జోక్యంతో మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. మళ్లీ మే నెల మొదటి వారం రావటంతో ఏపీ రాజకీయాలు పెన్షన్ల చుట్టూ తిరగటం మొదలైంది. అయితే ఈ సారి ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా ఏపీ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీలోనే మొదటిసారిగా ఏపీలో మే 1న లబ్ది దారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నారు. ఈ మేరకు సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బ్యాంకు ఖాతాలు లేనివారికి మాత్రం ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఏపీలో మొత్తం 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు.
మిగిలిన లబ్ది దారులకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేసే కార్యచరణ రూపొందించారు అధికారులు.
ప్రభుత్వ మార్గదర్శకాలు…
- వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పెన్షన్, వితంతు పింఛన్లు మొదలైన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ బయోమెట్రిక్ ప్రమాణీకరణతో గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల ద్వారా పెన్షనర్ ఇంటి గుమ్మం వద్దనే నగదును అందించనున్నారు.
- విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారుల కోసం ఇంటింటికీ పెన్షన్ ను పంపిణీ చేయనున్నారు. తీవ్రమైన అనారోగ్యాలను కలిగి ఉండటం, అస్వస్థతతో, మంచం పట్టి వీల్ చైర్లకు పరిమితమైన వారికి ఇంటి వద్దనే పెన్షన్ ను అందిస్తారు.
- పింఛనుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద తగినంత సిబ్బంది మరియు సామగ్రిని జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తారు.
- ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు బ్యాంకుల నుండి నగదును తమ సచివాలయాలకు తీసుకువెళ్లడానికి గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ కార్యదర్శులకు సిస్టమ్ జనరేటెడ్ ఆథరైజేషన్ లేఖను జారీ చేస్తారు. ఆథరైజేషన్ లెటర్స్ కాపీని సంబంధిత రిటర్నింగ్ అధికారులకు కూడా పంపాల్సి ఉంటుంది.
- గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లోని వార్డు పరిపాలనా కార్యదర్శులు బ్యాంకు నుండి నగదును ఉపసంహరించుకుంటారు. ఇంటింటికీ పెన్షన్ పంపిణీలో పాల్గొన్న గ్రామ,వార్డు శాఖ సిబ్బందికి అందజేస్తారు.
- ఆర్థిక శాఖ ముందురోజు సంబంధిత అన్ని బ్యాంకుల్లో అవసరమైన మొత్తాన్ని డ్రా చేయడానికి ఏర్పాట్లు చేసింది.
- జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలోని అన్ని బ్యాంకుల లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌లు , కంట్రోలర్‌లకు కూడా పై అంశాలపై సూచనలను జారీ చేయాలి మరియు బ్యాంకు శాఖలలో పెన్షనర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.
- పంచాయతీ సెక్రటరీ,వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 30/4/2024న బ్యాంకుల నుండి నగదును విత్ డ్రా చేసుకోవాలి.
- పింఛన్ల పంపిణీ మే1వ తేదీన ప్రారంభమవుతుంది. సానుకూలంగా 5వ తేదీ నాటికి పూర్తవుతుంది.
- ఇంటింటికి పింఛన్ల పంపిణీ సమయంలో, సచివాలయ సిబ్బంది పింఛను మొత్తాన్ని సక్రమంగా ఆధార్ ప్రమాణీకరణ (బయోమెట్రిక్/ఐరిస్/ఆధార్ ఫేస్) పొందడం ద్వారా పంపిణీ చేస్తారు.
- ఆధార్ ప్రమాణీకరణ విఫలమైతే, రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (RBIS) మోడ్ పెన్షన్ WEA/WWDS ద్వారా పంపిణీ ని పూర్తి చేస్తారు.
- పింఛన్ల పంపిణీ సమయంలో ఎలాంటి రాజకీయ ప్రచారం చేయకూడదు. పెన్షన్ పంపిణీ సమయంలో ఫోటోలు/వీడియోలను తీయకూడదు.
- పింఛన్ల పంపిణీ చేసేటప్పుడు ఎన్నికల కోడ్ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి.
- ఎంపీడీఓలు/మున్సిపల్ కమిషనర్లు పై మార్గదర్శకాలను అనుసరించి ఇంటింటికీ పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తారు.