భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో ఎన్నికలంటేనే ఓ మజా. ఓ నెల రోజుల పాటు నాయకుల వెనక తిరిగేటోళ్లకు రోజూ దసరా పండుగే. మందు, మనీ.. బిర్యానీ బువ్వ.. ఇలా ఒక్కటేంది ఏదంటే అది. ఎట్లయినా గెలిచేందుకు అభ్యర్థులు రెడీగా ఉంటరు. రియల్ ఎస్టేటో, ఏ కబ్జానో, దందానో చేసి మస్త్ కోట్లు ఆమ్దానీ సంపాదించి గుమ్ములు, బంకర్లల్ల దాసుకున్నవి అన్నీ కలిపి… ఇక ఎన్నికల టైంల బయటకు తీస్తరు. ఇగ వాటినే తన ఎనుక తిరిగేటోళ్లకు ఖర్చులకు, ప్రచార జంజాటాలకు, జనాలు పంచేందుకు ఖర్చు బెడతరు. మన ప్రజాస్వామ్యంలో అందరికి బాగా తెలసిన విషయమే. పైసలు పెట్టని క్యాండిడేట్లకు ఓటు ఎయ్యరు కదా జనాలు. అందుకే ఖర్చుకు వెనకాడరు. వెనకాడితే పోటీల ఉండుడే బంద్ జేసుకోవాలే. అందుకే పైసలు ఉన్నోళ్లే పోటీల ఉంటరు చాలా సార్లు గెలుస్తున్నారు.
ఎన్నికల్లో నిలువాలంటే ఇంత పెద్ద కథంతా ఉంటది కాబట్టి.. కొందరు ముందుగాల్నే పైసలు సదురుకుని ఎక్కడికి చేరాల్నో అక్కడికి చేర్చిన్రు. కొంత ఎనకపడ్డొళ్లు.. ఇప్పుడిప్పుడే ఊళ్లకు పంపుతున్నరు. ఇట్ల పంపిన సొమ్ము అక్కడక్కడ పోలీసోళ్లకు ఎంతో కొంత దొరుకుతున్నది. ఇట్ల దొరికిన పైసలు దేశం మొత్తం మీద మన తెలంగాణలో ఎక్కువట. మన రాష్ట్రంతో పాటు ఇంకో నాలుగు రాష్ట్రాలల్ల ఎలక్షన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఎన్నికల్ల ‘పంచుడు’ సొమ్ము దొరికింది మనకాడ్నే.
నిన్నటి వరకు 5 రాష్ట్రాలల్ల రూ.1760 కోట్ల విలువైన సొత్తు దొరికింది. అయితే ఇందులో మన తెలంగాణ రాష్ట్రంలో దొరికింది రూ.659.2 కోట్ల విలువది. ఇందులో మటుకు మన తెలంగాణే నంబర్ వన్. అంటే ఇసొంటి కాడ కూడా మనమే నంబర్ వన్ అన్నమాట. ఇగ మన తర్వాత రాజస్థాన్ రాష్ట్రంల రూ.650.7 కోట్ల విలువైన సొత్తు దొరికినయ్. సొత్తు అంటే పైసలు, మందు, డ్రగ్స్, లోహాలు అన్ని కలిపి అన్నమాట. గిప్పుడే ఇట్లుంటే ఇంక ముందు ముందు ఇంకెన్నీ దొరుకుతయో మరి అంటున్నారు సాధారణ ఓటర్లు. ఇది ఏమీ ఎవ్వరికి తెలియని విషయం కాదు అందరికి తెలిసిన చిదంబర రహస్యమే అంటున్నారు రాష్ట్ర ప్రజలు.