July 28, 2025 6:17 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Harish Rao: కాళేశ్వరం కమిషన్‌ ముందుకు హరీష్ రావు.. ఏం చెప్పారంటే..!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) వివాదంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghose Commission) విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కమిషన్ ముందు హాజరై కీలక విషయాలు వెల్లడించారు. సుమారు 40 నిమిషాలపాటు జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్‌కు హరీష్ రావు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, డిజైన్లు, నిర్మాణ మార్పులపై అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజైన్ల మార్పులు పూర్తిగా ఇంజినీర్ల సాంకేతిక నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయన్నారు. వీటిని రాజకీయంగా చూడకూడదని పేర్కొన్నారు. ప్రాజెక్టు లేఅవుట్ మ్యాప్‌ను చూపించి, మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల సంస్థ (సీడబ్ల్యూసీ) వ్యక్తపరిచిన అభ్యంతరాల వల్లే ప్రాజెక్టు రీడిజైన్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై సమస్యలు తలెత్తడంతో ప్రాజెక్టు రూపకల్పనను మళ్లీ సమీక్షించామని చెప్పారు. వాస్కోప్‌ అనే సంస్థతో సమగ్ర సర్వే చేయించిన తరువాతే ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చామని వివరించారు. జస్టిస్ ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ప్రత్యేకంగా ప్రశ్నించగా.. హరీష్ రావు వాటి నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందినట్లు తెలిపారు. ఇంజినీర్ల సాంకేతిక సలహాల మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాలు మార్పు చేశామని పేర్కొన్నారు. స్థల మార్పులు ప్రాజెక్టులలో సాధారణమని, ఇదివరకూ కూడా ఇతర ప్రాజెక్టులలో జరిగాయని గుర్తు చేశారు.

ఈ కార్పొరేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఆనకట్టల్లో నీటిని నిల్వ చేయాల్సిన నిర్ణయం ఎవరిది అని ప్రశ్నించగా, అటువంటి సాంకేతిక అంశాలు ఇంజినీర్ల పరిధిలోకి వస్తాయని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వం నుండి దీనిపై ఎటువంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ఇప్పటికే ఈటెల రాజేందర్ హాజరు కాగా.. తాజాగా హరీష్ రావు హాజరయ్యారు. అయితే కేసీఆర్ మాత్రం జూన్ 11న విచారణకు హాజరుకానున్నట్లు చెప్పారు.

Share This Post
error: Content is protected !!