భారత్ సమాచార్, జాతీయం : కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్ లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీనికి చివరి తేదీ ఈ నెల 31గా నిర్ణయించారు. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకే ఫాస్టాగ్ ను వేర్వేరు వాహనాలకు ఉపయోగించకుండా ఫాస్టాగ్ లకు కేవైసీని తప్పనిసరి చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
నేషనల్ హైవేలపై వాహనాలు టోల్ చెల్లించే విధానాన్ని సులభతరం చేస్తూ కేంద్రం దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనేపథ్యంలోనే ఫాస్టాగ్ లకు కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
దీంతో వాహనదారులు తమ ఫాస్టాగ్ ను కేవైసీని అప్ డేట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ కు కేవైసీ అయ్యిందో లేదో ఆన్ లైన్ లో తెలుసుకునే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో కేవైసీ స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకోసం మొదటగా ఫాస్టాగ్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అనంతరం మీ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. లేదంటే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా కూడా లాగిన్ కావొచ్చు. అనంతరం డ్యాష్ బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్’ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఫాస్టాగ్ కేవైసీ కాకపోయి ఉంటే అక్కడ అడిగిన వివరాలు సమర్పించాలి. దీంతో కేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.