July 28, 2025 5:15 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం

భారత్ సమాచార్.నెట్: బీఆర్ఎస్ నేత (BRS Leader), సిద్ధిపేట ఎమ్మెల్యే (MLA) హరీశ్ రావు (Harish Rao)కు తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt)లో ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన హరీశ్‌ రావు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని అందించి విజయం సాధించారని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్ రావుపై అనర్హత వేటు వేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు చక్రధర్‌ గౌడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తద్వారా హరీశ్‌ రావుకు న్యాయపరంగా ఊరట లభించింది. కాగా ఈ కేసులో హరీశ్ రావు తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. పిటిషన్‌కు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన హరీశ్ రావు.. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.
న్యాయస్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన విమర్శించారు. మొన్నటి ఫోన్ టాపింగ్ కేసైనా, ఇప్పుడు ఎన్నిక చెల్లదనే కేసు అయినా దురుద్దేశపూర్వకంగా పెట్టిందేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకోవడం మానేయాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదని.. తాము ప్రజల తరఫున ఎప్పుడూ అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Share This Post
error: Content is protected !!