భారత్ సమాచార్, విశాఖపట్నం ;
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వైజాగ్ వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్ల ను 1070, 112, 18004250101 ఏర్పాటు చేసింది. వర్షాల ప్రభావం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సహయం కొరకు అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
ఆగ్నేయ మధ్యప్రదేశ్ సహా పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా పరిసర ప్రాంతాలపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని ఐఎండీ స్పష్టం చేసింది.
రానున్న 48 గంటల్లో మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 19వ తేదీలోగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనూ ఏపీలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది.