భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొడుతోంది. నగరంలోని పంజాగుట్ట, అమీర్ పేట్, యూసఫ్‌గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అవరసమైతే తప్ప బయటకు రావాలని సూచించారు.
మరోవైపు భారీ వర్షాల కురుస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక ఐటీ ఉద్యోగులు సాధ్యంమైతే వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించారు.