భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రానున్న రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల, జనగామ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, యాదాద్రి, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక ఎల్లుండి హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
వర్షాల కారణంగా ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్‌పేట్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కేబీఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు, ప్రయాణికులు, ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Share This Post