భారత్ సమాచార్.నెట్: ఉపరితల ధ్రోణి, నైరుతి రుతుపవనాల కదలికతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో డ్యామ్‌లు, చెరువులు నిండు కుండల్లా మారాయి. అయితే రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేస్తూ ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్‌లు జారీ చేసింది వాతావరణశాఖ. తెలంగాణలోని ఆసిఫాబాద్, వరంగల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్.. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్సాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
అటు ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంతాలు, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. ఉభయగోదావరి, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది.