భారత్ సమాచార్, జాతీయం ;
ఇకపై విద్యార్థులు జనవరి పోతే జులై అంటూ అడ్మిషన్ల కోసం వెయిట్ చేయనున్నారు. విదేశీ వర్సిటీల తరహాలోనే భారతీయ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చీఫ్ తాజాగా వెల్లడించారు. ఈ విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరి మధ్య దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. “భారతీయ విశ్వవిద్యాలయాలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇస్తే బోర్డు ఫలితాల ప్రకటనలో జాప్యం, ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టు సెషన్ లో యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కోల్పోయిన చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు పెట్టడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం. ఎందుకంటే జూన్- ఆగస్టు సెషన్లో యూనివర్సిటీ లేదా ఉన్నత విద్యాసంస్థలో విద్యార్థులు చేరకపోయినా వారు మరుసటి ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ద్వైవార్షిక అడ్మిషన్ల వల్ల కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఏడాదికి రెండుసార్లు చేస్తాయి. దీంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.” అని యూజీసీ చీఫ్ తెలిపారు. ‘ఇప్పటికే విదేశీ యూనివర్సిటీలు ఫాలో అవుతున్నాయి’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ద్వైవార్షిక అడ్మిషన్ విధానాన్ని అనుసరిస్తున్నాయని యూజీసీ చీఫ్ తెలిపారు. భారతీయ ఉన్నత విద్యాసంస్థలు కూడా ఇలాంటి అవకాశం కల్పిస్తే ప్రపంచ విద్యా ప్రమాణాలకు పాటిస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు.
ఉన్నత విద్యాసంస్థలు ద్వైవార్షిక అడ్మిషన్లు అందించడం తప్పనిసరి కాదు. అవసరమైన మౌలిక సదుపాయాలు, టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న ఉన్నత విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని వారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ అవకాశం ఇచ్చింది. ద్వివార్షిక అడ్మిషన్లు ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ల్యాబ్స్, తరగతి గదుల వంటి వసతులను సమకూర్చు కోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ అవకాశాన్ని భారతీయ విద్యార్థులు ఏలా వినియోగించుకుంటారో చూడాలి.