భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలు (Metro Rail) వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్రో రైళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై (Betting apps Promotions) తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ఆగ్రహం (Serious) వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (Metro MD) ఎన్వీఎస్ రెడ్డికి (NVS Reddy) నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను తక్షణమే దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మెట్రో రైళ్లలో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించినప్పటికీ.. హైదరాబాద్ మెట్రో రైళ్లలో మాత్రం వాటి ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే కొన్ని బెట్టింగ్ యాప్‌ల కార్యకలాపాలపై ఈడీ విచారణ జరుపుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, మెట్రో రైళ్లలో ఇస్తున్న ప్రకటనల వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇక ఈ పిటిషన్‌పై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 2022 తర్వాత మెట్రో రైళ్లలో ఎలాంటి బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రదర్శించలేదని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు తమకు కొంత వ్యవధి కావాలని కోర్టును అభ్యర్థించారు. ఇరు పక్షాల ప్రాథమిక వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.