భారత్ సమాచార్.నెట్, మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం బోరోనియా ప్రాంతంలోని ఓ హిందూ దేవాలయంపై విద్వేషపూరిత రాతలు కనిపించడం కలకలం రేపింది. స్వామి నారాయణ్ ఆలయం గోడలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ సందేశాలు రాశారు. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయ గోడలపై హిట్లర్ చిత్రం ముద్రించి.. “గో హోమ్ బ్రౌన్..” అనే వ్యాఖ్యలను రాశారు.
అలాగే ఇదే ప్రాంతంలో ఆసియా దేశాలకు చెందిన ప్రజలు నడిపే పలు రెస్టారెంట్లపై కూడా ఇలాంటి విద్వేష పూరిత వ్యాఖ్యలు వ్రాసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా ఇటీవల అడిలైడ్ నగరంలో భారత్ విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్ కొందరు దాడికి చేయడమే కాకుండా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన మరువకముందే ఆ దేశంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మరోవైపు ఈ ఘటనపై హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్ భగవత్ స్పందించారు. ఈ ఘటన తమన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయని.. దేవాలయాలు భక్తి, శాంతి, ఐక్యతకు చిహ్నాలని, అలాంటి వాటిని లక్ష్యంగా దాడులు జరగడం బాధాకరమన్నారు. ఘటనను విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి జసింత్ అల్లన్ ఖండిస్తూ ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ జాత్యహంకార ఘటన తనను కలిచివేసిందన్నారు. ఇలాంటి చర్యలకు విక్టోరియాలో చోటు లేదని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించి పోలీసులకు దర్యాప్తు చేయాలని ఆదేశించారు.