భారత్ సమాచార్.నెట్: తిరుమల శ్రీవారిని ప్రపంచ వ్యాప్తంగా కొలిచే కోట్లాది మంది భక్తులు ఉన్న సంగతి తెలిసిందే. తమ జీవితంలో తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి అయినా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు భావిస్తారు. శ్రీవారి క్షణకాల దర్శనం కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తరిలివచ్చే భక్తులు ఉన్నారు. అంతటి పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో కొందరు వ్యాపారం చేయడం వివాదాస్పదమవుతోంది.
శ్రీవారి గర్భాలయ నమూనాతో విశాఖ హైవేపై రాయుడి మిలిటరీ హోటల్‌ను ఏర్పాటు చేసి అందులో నాన్ వెజ్ వడ్డిస్తున్నారు. జయ, విజయలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మెడ, కులశేఖర పడితో కూడిన నమూనాలతో హోటల్‌ను తీర్చిదిద్దారు. అయితే శ్రీవారి గర్భాలయం నమూనా ఏర్పాటు చేసి.. మాంసాహారం వడ్డించడంపై హిందూసంఘాలు, శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను వ్యాపారాలకు వాడుకుంటున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ టీటీడీకి ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈఓ, ఛైర్మెన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే హోటల్ వద్ద ఆందోళన చేపడతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వివాదంపై రాయుడి మిలిటరీ హోటల్ యాజమాన్యం స్పందించింది. తాము శ్రీవారి గర్భాలయ నమూనా ఏర్పాటు చేసినప్పటికీ నాన్ వెజ్ వంటకాలు అక్కడా వడ్డించడం లేదని చెప్పింది. మరి ఈ వ్యవహారంపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Share This Post