Homemain slidesఅన్నపూర్ణ దేశంలో ఆకలి కేకలు

అన్నపూర్ణ దేశంలో ఆకలి కేకలు

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

మన తల్లి అన్నపూర్ణ, మన అన్న దాన కర్ణ, మన భూమ వేద భూమి రా, సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్… అంటూ ఏనాడో శ్రీ శ్రీ మనదేశంలో ఉన్న ఆకలి కేకలని పాట రూపంలో చెప్పేశాడు. తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక కూడా ఇదే చెబుతోంది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ)లో భారతదేశ స్థానం నానాటికీ దిగజారిపోతోంది. 2024వ సంవత్సరానికి సంబంధించి విడుదలైన 19వ జీహెచ్‌ఐలో భారత్‌ 105వ స్థానంలో (మొత్తం 127 దేశాలు) నిలిచింది. భారత్ పొరుగున ఉన్న నేపాల్‌,శ్రీలంక,మయన్మార్‌,పాకిస్తాన్‌,ఆఫ్ఘనిస్తాన్‌ కంటే కూడా మనదేశం వెనుకబడి పోయింది. ‘కన్‌సర్న్‌ డే వరల్డ్‌వైడ్‌’, ‘వెల్త్‌ హంగర్‌లైఫ్‌’ సంయుక్తంగా ప్రచురిస్తున్న జీహెచ్‌ఐ సిరీస్‌ తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలను ప్రస్తావించింది.ఈ సంవత్సరపు నివేదికలో భారత్‌ స్కోరు 27.3.దేశంలో ఆకలి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో ఇది ప్రతిబింబిస్తోంది.ఇటీవలి సంవత్సరాలలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 2016వ సంవత్సరపు జీహెచ్‌ఐ స్కోరు 29.3తో పోలిస్తే ప్రస్తుత స్కోరు మెరుగైనప్పటికీ అది ఇప్పటికీ ‘తీవ్రత’ కేటగిరీలోనే ఉంది. పొరుగు దేశాల కంటే బాగా వెనుకబడి ఉంది.అయితే 2000వ సంవత్సరపు స్కోరు 38.4,2008 స్కోరు 35.2తో పోలిస్తే మాత్రం గణనీయమైన పురోగతి కన్పిస్తోంది.ఈ రెండు సందర్భాలలోనూ మన దేశం ‘ఆందోళనకరం’ అనే కేటగిరీలో ఉంది. ఆకలి సూచికను గణించే పద్ధతిలో మార్పులు చేసినందున, సవరించిన సమాచారాన్ని వినియోగించినందున 2023వ సంవత్సరపు నివేదికతో తాజా నివేదికను పోల్చలేదు. కానీ 2000, 2008, 2016, 2024 నివేదికలలోని సమాచారాన్ని పోల్చారు.

చిన్నారుల్లో పోషకాహార లోపం

ప్రపంచంలో భారతదేశానిదే అత్యధిక చైల్డ్‌ వేస్టింగ్‌ రేటు. (ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలలో ఎత్తుకు తగిన బరువు లేకపోవడం). మన దేశంలో చిన్నారుల కుంగుబాటు రేటు 35.5 శాతంగా ఉంది.ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలలో 2.9 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. 13.7 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పిల్లల మరణాల విషయంలో మన దేశం 2000వ సంవత్సరం నుండి మెరుగుదల కన్పిస్తోంది. అయినప్పటికీ పోషకాహార లోపం తీవ్రమైన సమస్యగానే ఉండిపోతోంది. ఈ సూచికలు తీవ్రమైన ప్రజారోగ్య సవాళ్లకు దారితీస్తున్నాయని నివేదిక తెలిపింది.

లక్ష్య సాధన అసాధ్యం

ప్రపంచ దేశాలలో ఆకలిని తగ్గించే విషయంలో 2016 నుండి పురోగతి లేదని నివేదిక ప్రస్తావించింది.2030 నాటికి ఆకలిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చునని స్పష్టం చేసింది. ఎందుకంటే ఆకలిపై 127 దేశాలలో అధ్యయనం జరపగా 42 దేశాలు నేటికీ ‘తీవ్రత’ లేదా ‘ఆందోళనకరం’ స్థాయిలోనే ఉన్నాయి.

ఈ మూడింటికీ లింకు

ఆకలి,వాతావరణ మార్పులు,లింగ అసమానత్వం… ఈ మూడింటి మధ్య నేరుగా సంబంధం ఉన్నదని నివేదిక వివరించింది. వివక్షాపూరితమైన నిబంధనలు,లింగ ఆధారిత హింస అనేవి మహిళలను,మైనారిటీలను ప్రమాదంలో పడేస్తున్నాయని,వారికి ఆహార,పోషకాహార భద్రత లభించడం లేదని తెలియజేసింది.ఈ సవాళ్లను అధిగమించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలకు వాతావరణ మార్పుల ప్రభావం ప్రతిబంధకంగా ఉంటోందని నివేదిక చెప్పింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

అత్యధిక భారతీయుల వలస ఆ దేశానికే…

RELATED ARTICLES

Most Popular

Recent Comments