భారత్ సమాచార్, రాజకీయం : ‘‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. ’’ డైలాగ్ తో కమెడియన్ పృథ్వీ రాజ్ బాగా పాపులర్ అనే సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పుడో వచ్చినా ఖడ్గం మూవీతో ఆయన ఫేమ్ అయ్యారు. ఆ సినిమాలోని డైలాగే ఆయన చిరునామాగా మారిపోయింది. పలు చిత్రాల్లో పృథ్వీ చేసిన కామెడీ రోల్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇటీవల బ్రో మూవీ పాత్ర కూడా ఆడియన్స్ ను బాగా అలరించింది.
2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామా చేశారు. ఆ పార్టీ తరపున ప్రచారం చేయడానికి రాష్ట్రమంతా కలియతిరిగారు. ఆయన కష్టానికి ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి అప్పగించారు. ఆ తర్వాత ఓ మహిళతో ఫోన్ సంభాషణ లీక్ కావడంతో పృథ్వీ పదవి కోల్పోయారు.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా పృథ్వీ జనసేనకు మద్దతు దారుడిగా నిలిచారు. ఇక రీసెంట్ గా ఆ పార్టీలో కుటుంబ సమేతంగా వచ్చి చేరారు. అనంతరం పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. బ్రో మూవీలో పోషించిన శ్యాంబాబు పాత్ర ఎంత వివాదం అయ్యిందో తెలిసిందే. మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ ఆ పాత్ర క్రియేట్ చేసినట్టు పెద్ద కాంట్రావర్సీ అయింది.
ఆ వివాదం అలా సద్దుమణిగింది అనుకుంటే మళ్లీ మరోమారు బ్రో గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. శ్యాంబాబు పాత్రలో రాష్ట్రమంతా తిరిగి జనసేన-టీడీపీ కూటమికి ప్రచారం చేస్తానని పృథ్వీ ప్రకటించారు. అందరూ కోరుకుంటే అంబటి రాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు పాత్రలో ప్రచారం మొదలు పెడుతానని అన్నారు. టికెట్ కానీ పదవి కానీ తాను ఆశించడం లేదని ఈ సందర్భంగా పృథ్వీ చెప్పారు. ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయిందని, రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు.
బ్రో చిత్రంలో శ్యాంబాబు పాత్ర వైరల్ అయినప్పుడు అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించి మరీ ఘాటుగా రియక్ట్ అయ్యారు. ఇప్పుడు పృథ్వీ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.