భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పి ఇప్పటికే 21 నెలలు దాటింది. నోటిఫికేషన్లు వచ్చినా ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తికాకపోవడంతో నిరుద్యోగుల్లో మళ్లీ నైరాశ్యం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలు ఆగమ్యగోచరంగా తయారయ్యాయి. పదేండ్ల తర్వాత వచ్చిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దు.. గ్రూప్-2 రెండు సార్లు వాయిదా, గ్రూప్-4 జరిగినా ఫలితాలు ఎప్పుడిస్తారో తెలియదు.. గ్రూప్-3, డీఏవో, డీఎస్సీ తదితర పరీక్ష తేదీల ఊసే లేదు. ఇప్పటికే అష్టకష్టాలు పడుతూ ఎన్నో ఏండ్లుగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను పట్టించుకున్న నాయకుడు ఒక్కడూ లేడు.
ఎన్నికల ప్రక్రియను టైమ్ కు సజావుగా నిర్వహించుకుంటున్న పాలకులు.. ఉద్యోగాల భర్తీపై డేట్, టైం.. పారదర్శకత, నిజాయితీ..లాంటి ఏవీ పట్టించుకోవడం లేదు. ఇక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిరుద్యోగుల ఓట్ల కోసం నేతలు పాకులాడుతున్నారు. ఇదే వాళ్ల ఇంట్లో నుంచి జాబులు ఇచ్చినట్టు, వారు సంపాదించిన దాంట్లో సొమ్ములు జీతాలుగా ఇచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. పాలకులైనా, అధికారులైనా.. ఎవరైనా ప్రజా సేవకులే. అందరికీ అన్నం పెట్టేది ప్రజలే. ఆ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన పార్టీలు వారి స్వలాభం కోసమే నానా హామీలు ఇవ్వడం శోచనీయం.
తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేస్తామని, బోర్డును ప్రక్షాళన చేస్తామని , డిసెంబర్ 4న అశోక్ నగర్ విద్యార్థులతో సమావేశం అవుతామని బీఆర్ఎస్ చెపుతోంది. ఇక కాంగ్రెస్ అయితే ఏకంగా జాబ్ నోటిఫికేషన్లకు డేట్లు కూడా ఇచ్చింది. బీజేపీ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని చేస్తామని అంటోంది. అయితే నిరుద్యోగుల బాధను వీరు గెలిచాక ఏపాటి గౌరవిస్తారో చూడాలి. కాలయాపన చేయకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోపే ఇప్పటికే ప్రకటించిన 80వేల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీటికే మరిన్ని పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్లు జారీ చేయాలంటున్నారు. లేకుంటే కొత్త నోటిఫికేషన్ల పేరుతో సాగదీసి మరో రెండు, మూడు ఏండ్లు చదివేలా చేస్తే ఊరుకోమంటున్నారు. ఇప్పటికే ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయామని మరో ఐదారు నెలల కంటే ఎక్కువ ప్రిపరేషన్ చేసే ఓపిక, సహనం తాము కోల్పోయామని పేద నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.