భారత్ సమాచార్, సిద్దిపేట ;
సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ రోడ్డులో కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ తొలి మేయర్ గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ నగరానికి ఎంతో సేవలు అందించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ముందుకు సాగాలని కోరుకున్నారు. ముదిరాజ్ సమాజం నుంచి సిద్దిపేటలో సర్పంచులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా అనేక పదవుల్లో ముదిరాజులను గౌరవించామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించామన్నారు. అదే విధంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ ఆత్మ గౌరవ భవనాలు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట ఒక్కటేనన్నారు. ముదిరాజ్ రిజర్వేషన్ కు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని తెలిపారు. మత్స్యకారులకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత్వ కార్డులను మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ముదిరాజులు కృష్ణ స్వామి మార్గంలో ఐక్యంగా ముందుకు సాగాలని, వారి విగ్రహాన్ని చూసినప్పుడు మరింత స్ఫూర్తినివ్వాలని కోరుకున్నారు. ఈ చౌరస్తాని కృష్ణస్వామి జంక్షన్ గా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.