భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అదనపు సుంకాలు విధించే బెదిరింపులపై ట్రంప్‌కు ఘాటుగా బదులు ఇచ్చింది కేంద్రం. భారత్ ఎక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అనేది తమ అంతర్గత వ్యవహారమని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని భారత్ విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అమెరికా, రష్యాల మధ్య వివాదంలోకి భారత్‌ను తేవడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్ స్థిరత్వం కోసం గతంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా ప్రోత్సహించిందని.. ఇప్పుడు అదే అమెరికా వ్యతిరేకిస్తోందని విమర్శించారు.
సుదీర్ఘకాలంగా రష్యాతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూన్నామని.. అది అలానే కొనసాగుతుందని తేల్చిచెప్పింది భారత్. అంతేకాదు భారత్‌ను విమర్శిస్తున్న దేశాలే రష్యాతో భారీగా వ్యాపారం చేస్తున్నాయని భారత్ వేలెత్తి చూపింది. అమెరికాతో పాటు యూరోపియన యూనియన్ సభ్య దేశాలు రష్యాతో వ్యాపారాలను కొనసాగిస్తున్న.. భారత్‌ను టార్గెట్ చేసుకుని ఇలా వ్యాఖ్యలు చేయడం అమెరికా మానుకోవాలని హితవు పలికింది.