August 5, 2025 1:07 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Boeing Dreamliner: బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్రం

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదం (Plane Crash) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 (Boeing Dreamliner 787-8) విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.
 ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ, ఆపరేటింగ్ విధానాలను కూడా లోతుగా పరిశీలించిన తర్వాతే బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు వివరించాయి. అంతే కాదు ఎయిర్ ఇండియాతో పాటు, ఇతర విమానయాన సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో 265 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన, దేశంలో గగనతల భద్రతపై తీవ్రంగా చర్చలు మొదలయ్యేలా చేసింది. సాధారణంగా బోయింగ్ విమానాలను టెక్నాలజీ, భద్రత, వేగం, ఇంధన సామర్థ్యం పరంగా అత్యుత్తమంగా భావిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ విమాన తయారీ సంస్థలతో పోల్చినపుడు, బోయింగ్‌ విమానాలు ఆధునికమైనవిగా పేరుగాంచినవి. కానీ, అహ్మదాబాద్‌ దుర్ఘటన తర్వాత బోయింగ్‌ విమానాల భద్రతపై సందేహాలు మొదలయ్యాయి.
Share This Post