July 28, 2025 8:20 am

Email : bharathsamachar123@gmail.com

BS

India-US: అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు!

భారత్ సమాచార్.నెట్: అమెరికా (America) నుండి దిగుమతయ్యే కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు (Tariffs) విధించేందుకు భారత్ (India) సిద్ధమైంది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) దృష్టికి తీసుకెళ్లారు భారత్ వాణిజ్య ప్రతినిధులు. అమెరికా ప్రభుత్వం భారత స్టీల్‌ మరియు అల్యూమినియం ఎగుమతులపై విధించిన అధిక దిగుమతి సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కొన్ని ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులకు ఇప్పటివరకు కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించుకోవడంతో పాటు.. వాటిపై దిగుమతి సుంకాలను పెంచేందుకు భారత్ యోచిస్తున్నట్లు డబ్ల్యూటీఓకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా పడుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంచనాల ప్రకారం, 7.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులు దీని వల్ల నష్టాన్ని చవిచూస్తాయని అంచనా. ఈ నేపథ్యంలోనే అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక (ప్రొటెక్షనిస్ట్‌) విధానాలను భారత్‌ విమర్శించడంలో వెనుకడుగు వేయలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై టారిఫ్‌లు భారీగా పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ స్టీల్‌ తయారీలో భారత్‌ రెండవ స్థానంలో నిలవగా, ట్రంప్ విధించిన ఈ సుంకాల ప్రభావం భారత స్టీల్‌ పరిశ్రమపై గణనీయంగా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు WTO వేదికగా ఈ అంశాన్ని తీవ్రమైన ప్రస్తావిస్తోంది. భారత్, అమెరికా మధ్య ఒక సరికొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో, ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Share This Post
error: Content is protected !!