భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని, ఈ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కలిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించింది. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎటువంటి అవినీతికి తావులేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. వారంలోగా పూర్తి:
పదేండ్లలో హౌసింగ్ సెక్టార్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేశామని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకొస్తామని పొంగులేటి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారంలోగా పూర్తవుతుందని, లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.