August 4, 2025 7:08 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Operation Sindhu: ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుండి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

భారత్ సమాచార్.నెట్: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం (Indian Govt) కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) పేరుతో ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొలి దశలో కేంద్ర ప్రభుత్వం 110 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించింది. వీరికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ స్వాగతం పలికారు.

బుధవారం రోజున ఆర్మేనియాలోని రాజధాని యెరవాన్‌ నుంచి ప్రత్యేక విమానంలో విద్యార్థులు బయలుదేరిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం తెల్లవారుజామున ఈ విద్యార్థులంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌కు చేరుకున్న విద్యార్థుల్లో అత్యధికంగా 90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. స్వదేశానికి తిరిగివచ్చినందుకు విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీకి, భారత విదేశాంగశాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరాన్‌లో మొత్తంగా 4 వేల మంది భారతీయులు ఉండగా, ఇందులో సగం మంది విద్యార్థులే ఉన్నారు. భారత విజ్ఞప్తి మేరకు వారిని ఇప్పటికే ఇరాన్‌ ప్రభుత్వం టెహ్రాన్‌ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులు దాదాపు ఎవరూ లేనట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత ఎంబసీ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలని, టెహ్రాన్‌ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్‌ అవ్వాలని కోరింది.
Share This Post