Homemain slidesకారు కదలటం లేదు... ఫ్యాను తిరగటం లేదు

కారు కదలటం లేదు… ఫ్యాను తిరగటం లేదు

భారత్ సమాచార్, జాతీయం: నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు తయారైంది కేసీఆర్ పరిస్థితి. అధికారం ఉన్నపుడు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆయన తపన చివరికి ఆయన్నే మింగేసేలా తయారైంది. 2014 నుంచి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని నయానో.. భయానో బీఆర్ఎస్‌లో చేర్చుకుంటూ వచ్చారు. 2018లోపు దాదాపు తెలంగాణలో టీడీపీ లేకుండా చేశారు. ఈ తర్వాత 2023లోపు కాంగ్రెస్ ను కూడా ఖతం చేయాలని చూశారు. దాదాపు ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే.. రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. ప్రజలు ఇచ్చిన ఓటమిని గౌరవించకుండా అవకాశం దొరికిన ప్రతిసారీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. మరో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని చెప్పడం మొదలు పెట్టారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఇష్టపడలేదు. కానీ, ప్రభుత్వాన్నే కూల్చేస్తామంటే ఎవరికైనా తప్పదు.

అందుకే కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని అంటున్నవారిని రేవంత్ రెడ్డి కలుపుకొని పోతున్నారు. బీఆర్ఎస్ 40 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు. నిన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ లోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మినహా అసెంబ్లీకి వచ్చింది లేదు. ఇకపై వస్తానని ఆయన ప్రకటన చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టేసరికి ఆయనకు ప్రతిపక్షహోదా కూడా దక్కేలా కనిపించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారికి బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా రోజులు లేదంటే కొన్ని నెలల్లో అసెంబ్లీలో బీజేపీ కంటే బీఆర్ఎస్‌ తక్కువ సంఖ్యా బలానికి పడిపోతుందని గులాబీ నేతలే చెబుతున్నారు.

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ
పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని ఫిక్స్ అయ్యారట. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక ఎత్తు అయితే.. ఓటమికి బీఆర్ఎస్ అధినేతే కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఆయనే స్వయంగా ఓటు బ్యాంక్ సిఫ్ట్ చేశారనే వాళ్లు కూడా ఉన్నారు. దీంతో.. పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మంతనాలు మంతనాలు జరుపుతున్నారు.

వారంతా హస్తం గూటికి చేరే అవకాశం ఉంది. మిగిలిన వారు టైం చూసి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఫిరాయింపులను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నపుడు పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా.. ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. ఇప్పుడు తలపట్టుకుంటే ప్రయోజనం ఏంటని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినపుడైనా.. ప్రజల్లో తిరిగితే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిని గౌరవిస్తున్నామని కూడా చెప్పకపోతే.. ప్రజలు ఆదరించరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా, ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా.. లోక్‌సభ ఎన్నికల సమయానికి బస్సు యాత్ర చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? గెలుపు ఓటములు పక్కన పెడితే.. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ప్రయత్నం ఇపుడు బీఆర్ఎస్ పార్టీని నిలువునా దహించేస్తుంది. చూస్తుండగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నా.. ప్రశ్నించే సాహసం చేయలేని పరిస్థితి కేసీఆర్ కు ఎదురైంది. ఒకవేళ ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నలకు ముందు కేసీఆరే సమాధానం చెప్పాలి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నడానికి కేసీఆర్ఏ మంచి ఉదాహరణ.

బీఆర్ఎస్, వైసీపీ పని అయిపోలేదు
ఎక్కడైనా అధికారంలో ఏ పార్టీ ఉంటే వారిదే పై చేయి అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ కు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. అంత మాత్రన కేసీఆర్, బీఆర్ఎస్ పని అయిపోలేదు అన్నట్లే కదా. ఇదే పరిస్థితి ఇప్పుడు ఏపీలో వైసీపీ కూడా ఎదరుకుంటుంది. భవిష్యత్తులో మళ్లీ ఈ పార్టీలు పుంజుకుంటాయనడంలో ఎలాంటి సందేశం లేదు. ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీల నాయకులు తీరు ఎలా ఉందంటే పంది బలిస్తే ఏనుగు అనుకుంటున్నారు. వాపుని చూసి బపులాగా ఫీల్ అవుతున్నారు. సో రాజకీయాల్లో గెలుపు..ఓటములు సహజం. ఎత్తు పల్లాలు కామన్. అంతే ప్రతి దానికి కాలమే సమాధానం చెప్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments