భారత్ సమాచార్,సినీ టాక్స్ : ఇప్పటి యూత్ టీం-ట్వంటీ జనరేషన్ లో ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా టైం వేస్ట్ చేసే పరిస్థితిలో లేరు. ట్రావెలింగ్ లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిమిషంన్నర ఉండడానికే నానా హైరానా పడుతున్న కాలం ఇది. అంతా బిజీ పర్సన్స్ అయ్యారు. టైమ్ ఈజ్ మనీ అంటున్న రోజులు. అయితే ఈ బిజీ సినిమాల విషయంలో మాత్రం అస్సలు కానే కాదు బ్రో అని.. అంటున్నారు ఆడియన్స్. మూవీ రన్ టైం మూడు గంటలు దాటినా కూడా పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొడుతున్నాయి.
రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీ రన్ టైం 3గంటల 21 నిమిషాలు. అయినా కూడా జనాలు ఎక్కడా విసుగు చెందకుండా చూసేస్తున్నారు. సినిమా కథలో బలం, నడిపించే విధానం బాగుంటే 3 గంటలు దాటినా సినీ ప్రేమికులు బోర్ గా ఫీల్ కాకుండా సినిమాలు చూస్తారని మరోసారి నిరూపించారు. ఇలాంటి సినిమాలకు తొలి అడుగుగా మహానటుడు ఎన్టీఆర్ ‘‘దానవీరశూరకర్ణ’’ మూవీని ఉదాహరణగా చెప్పవచ్చు. అప్పట్లోనే ఈ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 53 నిమిషాలు. అయినా కూడా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో ప్రతి సన్నివేశం కూడా ఒక అద్భుతం. డైలాగులు, పాటలు జనాలను ఎంతగానో అలరిస్తాయి. రన్ టైం ఎక్కువుండి బంపర్ హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప, అర్జున్ రెడ్డి.. లాంటి సినిమాలు రన్ టైం ఎక్కువైన జనాలను అలరించాయి. అయితే ఈ ట్రెండ్ కొన్ని సినిమాలకు వర్క్ వుట్ కాలేదు. రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. మూడు గంటల నిడివి ఉండడంతో ఆడియన్స్ బోర్ గా ఫీలయ్యారు. చివరకు నిడివి తగ్గించినా జనాలు ఆదరించలేదు. మంచి కథను డైరెక్టర్ హ్యాండిల్ చేయడంలో విఫలం కావడమే అందుకు కారణం.