భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిల మధ్య గొడవ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఆదివారం కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘లిల్లీపుట్ నాయకుడు’ అంటూ జగదీష్ రెడ్డిని విమర్శిస్తే.. ఆయన కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘నా ఉద్యమ ప్రస్థానం గురించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లు’ అంటూ కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణల మాటలనే కవిత వల్లే వేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో లుకలుక ప్రారంభమయ్యాయనే చర్చలకు దారితీసింది.
బహిరంగ విమర్శలు.. బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు:
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు గులాబీ పార్టీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ వివాదం కవిత చేసిన సంచలన ఆరోపణలతో మొదలైంది. కవిత, జగదీష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం బీఆర్‌ఎస్ పార్టీలో పెద్ద కుదుపుకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి బహిరంగ విమర్శలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత పెంచే అవకాశాలు లేకపోలేదు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయంలో.. సొంత పార్టీ నాయకుల మధ్యే ఇలాంటి మాటల తూటాలు పేలడం బీఆర్‌ఎస్ ప్రతిష్టకు నష్టం కలగడమే కాకుండా, పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు గందరగోళం నెలకుంది.
మరిన్ని కథనాలు: