భారత్ సమాచార్, తాడేపల్లిగూడెం: సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. బుధవారం టీడీపీ-జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ సిద్ధం అంటున్నారని.. ఆయనకు యుద్ధం అంటే ఏంటో చూపిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటించారు. తాడేపల్లి కోటను బద్దలు కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని.. అందుకే టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘2024లో టీడీపీ-జనసేన సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సహకరించుకుంటే ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ బంగారంలా ఉంటుంది. మనలో మనం కలహాలాడుకుంటే మళ్లీ దుర్మార్గుడు, దాష్టీకుడు వచ్చి ప్రజాకంటకుడిగా మారతాడు’ అని ధ్వజమెత్తారు. ‘‘జగన్ బతుకు జూబ్లీహిల్స్ సొసైటీ ఫామ్‌హౌస్ కట్టినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్‌పోస్టులో ఏం చేసేవాడో నాకు తెలుసు. బంజారాహిల్స్ రెస్టారెంట్‌లో ఏం చేశాడో నాకు తెలుసు. మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల కొద్దీ ఉంది.’’ అని మండిపడ్డారు.
ఇదే కొనసాగితే స్కామాంధ్ర అవుతుంది:
సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అనుభవం కలిగిన రాజకీయ ఉద్ధండుడు చంద్రబాబును 53 రోజులు జైలులో పెడితే తనకు బాధేసిందని, ఆయన సతీమణిని అనకూడని మాటలంటే బాధ కలిగిందని అన్నారు. జగన్‌కు అధికారం వస్తే స్కామాంధ్ర అవుతుందని మోదీ అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి గానీ రాజధాని వికేంద్రీకరణ కాదన్నారు. మూడు చోట్లకు పరిగెత్తాల్సి వస్తుంది. అమరావతే రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.