భారత్ సమాచార్.నెట్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్రీ జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు ఇస్కాన్ నిర్వాహకులు. న్యూ టౌన్‌లోని టీటీడీ కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహభరితంగా జగన్నాథ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో జగన్నాథుడిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు భక్తులు.
జగన్నాథ రథ యాత్ర సందర్భంగా స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. స్వామివారి భజనలు, నృత్యాల నడుమ రథాన్ని ముందుకు లాగారు భక్తులు. ప్రధాన వీధులన్ని హరి నామస్మరణతో మార్మోగిపోయాయి. ఈ రథోత్సవంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ పాల్గొన్నారు. సెంట్రల్ లైబ్రరీ నుంచి క్లాక్ టవర్ జరిగిన రథయాత్ర ఉత్సవంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇస్కాన్ ప్రతినిధి రాధ మనోహర్ దాస్‌తో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా బండారి శాంతి కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి పండుగలు, పుణ్య పర్వాలు భారతీయ సంస్కృతి సంపదను పెంచుతాయన్నారు. కేవలం మతపరమైన వేడుకలు మాత్రమే కాకుండా.. సమాజాన్ని ఏకం చేసే వారధిగా నిలుస్తాయన్నారు. ఈ పండుగాలు మన సాంప్రదాయాలు, నమ్మకాలు, విలువలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. జగన్నాథుని రథయాత్ర మన సంస్కృతి గర్వానికి ప్రతీక. దేశభక్తి, ధర్మబద్ధత, సామూహిక శక్తి.. ఇవన్నీ ఇలాంటి ఉత్సవాల్లో స్పష్టంగా కనిపిస్తాయన్నారు.