భారత్ సమాచార్.నెట్: ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రథయాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండిచా ఆలయం సమీపంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. గుండిచా ఆలయం సమీపానికి లక్షలాది మంది భక్తులు దైవ దర్శనానికి ఒక్కసారిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలో కోల్పోగా మరో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు అధికారులు.
అయితే రథంపై కూర్చున్న జగన్నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శన సమయంలో జన సమూహాన్ని నియంత్రించడం అక్కడి సిబ్బందికి, అధికారులకు చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలోనే జనాలు ఒకరినొకరు తోసుకుంటూ నేలపై పడిపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు మృతులు ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)లుగా గుర్తించారు అధికారులు.
ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను క్షమాపణ కోరారు. భగవంతుని దివ్య దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ కారణంగా ఈ విషాదం చోటుచేసుకుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి పరిపాలనా విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి. అదేవిధంగా ఈ విషాదానికి ప్రతిస్పందనగా పూరీ జీల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్‌ను బదిలీ వేటు వేశారు.