భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి (Vice President), రాజ్యసభ ఛైర్మన్ (Rajya sabha Chairman) జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని (President) సుప్రీంకోర్టు (Supremecourt) ఆదేశించలేదని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇదే అంశంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సంబంధిత విషయాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ (Ultimate Masters) అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతగలవారిగా ఉండాలి. ఎమర్జెన్సీ విధించిన ప్రధానమంత్రి అయిన సరే. ఎమర్జెన్సీ విధించినప్పటికీ ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యానికి ఉంది. రాజ్యంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే తుది నిర్ణయం తీసుకునే అధికారులుగా ఉండాలి. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. పార్లమెంటే సుప్రీం అని జగదీప్ ధన్కర్ వ్యాఖ్యానించారు.
ఇదిలాఉంటే.. రాష్ట్రాల బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టే అధికారం లేదని.. అదేవిధంగా రాష్ట్రపతికి కూడా బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీం ఇచ్చిన సంచలన తీర్పుపై జగదీఫ్ ధన్కర్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్నారు. మరోసారి ఇవాళ పార్లమెంటే దేశంలో అత్యున్నతమైనది వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశమైంది.