భారత్ సమాచార్.నెట్, చైనా:
పహల్గామ్ ఉగ్రదాడి ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి అని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యటక రంగాన్ని దెబ్బతీయడమే కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ దాడి లక్ష్యమని పేర్కొన్నారు. చైనా వేదికగా టియాంజిన్‌లో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్న జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు దుష్టశక్తులని.. ఈ దుష్టశక్తులపై పోరాటమే ఎస్‌సీఓ ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిందని చెప్పారు. ఉగ్రవాదానికి పాల్పడుతూ, ప్రోత్సహిస్తున్న శక్తులను చట్టం ముందుకు తీసుకురావాలనేదే భారత్ దృఢ సంకల్పాన్ని యూఎన్ పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమనే సందేశం ఎస్‌సీఓ సమావేశం బలంగా నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక అఫ్గానిస్తాన్ సుస్థిరత, సంక్షేమం కోసం భారత్ ఎంతో కాలంగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆఫ్గానిస్తాన్ అభివృద్ధికి ఎస్‌సీఓ సభ్యదేశాలు మరింత సహకారం అందించాలని జైశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లోబల్ అఫైర్స్‌లో తమ ప్రభావాన్ని విస్తరించుకునేందుకు సభ్యదేశాలన్నీ ఒకే దారిలో నడవాలని.. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలన్నారు. సమష్టి సామర్థ్యంతోనే ఎస్‌సీఓ విజయాలు సాధిస్తుందన్నారు. ఇకపోతే జూన్ 2020లో గల్వాన్ లోయలో సైనకి ఘర్షణల తర్వాత భారత్ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
Share This Post