భారత్ సమాచార్, అమరావతి ;
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయాన్ని నమోదు చేసిన పార్టీ జనసేన. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా మరింతగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదుకు పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునే కార్యకర్తలకు రూ.5 లక్షల భీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దామని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పది రోజులపాటు ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసైనికులను కోరారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వ నమోదు కోసం వేచి చూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
‘జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ క్లియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓ వారథిలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్క నాయకుడు, జన సైనికులు, వీర మహిళలు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదో అద్భుతమైన వేదికగా నిలుస్తుంది’అని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీకి గతంలో ఉన్న 6.47 లక్షల మంది క్రియాశీల సభ్యులను రెన్యువల్ చేస్తూనే కొత్త వారిని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం నుంచి ప్రారంభం అయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నాయకులంతా ఆయా కేంద్రాల్లో కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదును సమష్టిగా విజయవంతం చేయాల్సి ఉందన్నారు. కేవలం లాగిన్ ఐడీలు పొందిన వారిది మాత్రమే బాధ్యత అనుకోవద్దు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త సభ్యత్వాలు పెంచేందుకు తగిన విధంగా కష్టపడాలన్నారు.