భారత్ సమాచార్.నెట్: నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కీలక పాత్రలో నటించిన చిత్రం “క” (KA). నూతన దర్శకులు (Directors) సుజిత (Sujith), సందీప్ (Sandeep) సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక్ (Nayan Sarika), తన్వీ రామ్ (Tanvi Ram) కథానాయికలుగా నటించారు. దీపావళి కానుకగా గతేడాది చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కు (Dadasaheb Phalke International Film Festival) నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్రం విభాగానికి ఈ సినిమా నామినేట్ అయినట్లు టీమ్ ప్రకటించింది. ఈ నెల 25న ఢిల్లీ వేదికగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.
ఇక “క” మూవీ విషయానికి వస్తే.. సుజీత్, సందీప్ దర్శకత్వంలో 1970 బ్యాక్ డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. తన సొంతవాళ్లే రాశారని ఊహించుకుంటూ జీవితాన్ని గడిపే వ్యక్తి. అలా ఓ రోజు ఉత్తరం చదువుతుండగా ఆ ఊళ్లో కనిపించకుండా పోయిన అమ్మాయిల గురించి ఓ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..? అనే నేపథ్యంలో సిద్ధమైన చిత్రమిది. దీనికి కొనసాగింపుగా “క 2” ఉంటుందని ఇప్పటికే టీమ్ ప్రకటించింది. ‘పార్ట్ 1’తో పోలిస్తే.. ‘పార్ట్ 2’ మరింత ఉత్కంఠగా సాగేలా చూస్తామని టీమ్ పేర్కొంది.
ఇదిలా ఉంటే విమర్శకులు, సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ రివ్యూలు దక్కించుకున్న ఈ చిత్రం… ఎలాంటి అంచనాలు లేకుండా వారం రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 50 కోట్ల వసూళ్లను సాధించింది. పలువురు సెలెబ్రెటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూల్స్ రంజన్, మీటర్ వంటి సినిమాలతో వరుస ప్లాపులు చూసిన కిరణ్ అబ్బవరంకు “క” మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. కానీ, ఈ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయారు. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘దిల్ రూబా’ డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది.