భారత్ సమాచార్.నెట్, చెన్నై: ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య అన్నింటికంటే పదునైన ఆయుధం అని కమల్ హాసన్ అన్నారు. మన చేతుల్లో ఇంకేది ఉండకూడదని.. విద్య ఒక్కటే ఉండాలన్నారు. విద్య లేకపోతే గెలవలేం అని.. జ్ఞానమే మన ఆస్తి అంటూ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి, “సనాతన” భావాలను ఎదుర్కునేందుకు విద్య అవసరం అని చెప్పుకొచ్చారు. విద్య లేకపోతే మెజార్టీ మూర్ఖులు మనల్ని ఓడిస్తారన్నారు.
స్టార్ హీరో సూర్య ఏర్పాటు చేసిన అరగం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. బీజేపీ నేతలు కమల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. ప్రజలను విభజించేందుకు మతపరమైన అంశాన్ని కమల్ హాసన్ లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ లీడర్లు ఏది మాట్లాడిన సనాతన ధర్మాన్ని తులనాడటమేనా..? అంతకు మించిన జ్ఞానం వారికి లేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్య అవసరమే కానీ.. విద్య వల్ల సనాతన భావాలను ఎలా ఎదుర్కుంటారో కమల్ హాసన్‌కే తెలియాలి అంటున్నారు. కాగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మంపై గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో సనాతన ధర్మాన్ని పోల్చి ఉదయనిధి వార్తల్లో నిలవగా.. తాజాగా అదే డీఎంకే పార్టీ తరఫున ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన కమల్ హాసన్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.