August 4, 2025 6:58 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Kedarnath: తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులపై పూల వర్షం

భారత్ సమాచార్.నెట్: దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని కేదార్‌నాథ్ ఆలయ (Kedarnath Temple) ద్వారాలు భక్తుల (Devotees) కోసం తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు అర్చకులు. ఈ వేడుకలకు విచ్చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) తొలి పూజ చేశారు. ఈ వేడుకల్లో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల కమిటీ సభ్యులు, అధికారులతో పాటు పూజారులు, వేద పండితులు పాల్గొన్నారు.

భారీ మంచు కారణంగా సుదీర్ఘకాలం మూసి ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని ఇవాళ తెరుచుకోవడంతో.. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. అలాగే ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఇందుకోసం 13 టన్నుల పూలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇకపోతే చార్‌ధామ్ యాత్రలో భాగంగా ఇటీవల అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన బద్రీనాథ్ ఆలయం మాత్రం మే 4న భక్తుల దర్శనార్థం అందుబాటులోకి రానుంది.
ఇదిలా ఉంటే కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ ప్రాంతం నుంచి హెలికాప్టర్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేదార్‌నాథ్‌కు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. భద్రతా పరంగా జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని, కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాలతో పాటు పలు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా దళాలను భారీగా మోహరించారు.
Share This Post