భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు సిట్ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సిట్ విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ ఆరోపణలపై కేసీఆర్ కుమారుడు కేటీఆర్ స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపించాలని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు కేటీఆర్.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. మీరు చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. లేదంటే 48 గంటల్లో బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని.. తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.
కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్‌కు కనీస జ్ఞానం లేదన్నారు. ఇలాంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మోసినంత సులువు కాదని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని విమర్శించారు. కాగా సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.