August 4, 2025 7:00 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

KTR: పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగింది: కేటీఆర్

భారత్ సమాచార్.నెట్: ఫార్ములా ఈ రేసు (Formula E race) నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) ఏసీబీ (ACB) ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈరోజు జరిగిన విచారణకు సెల్‌ఫోన్‌ తీసుకురాలేదని కేటీఆర్‌ తెలిపారు. ఈ రేసు నిర్వహించిన సమయంలో కేటీఆర్‌ వాడిన సెల్‌ఫోన్లు అప్పగించాలని అధికారులు ఆయనకు ఆదేశించారు. జూన్ 18లోపు సెల్‌ఫోన్లు అప్పగించాలని స్పష్టం చేశారు.

విచారణ జరిగిన తర్వాత కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.” రేవంత్‌ అసెంబ్లీలో ఈ కార్‌ రేసింగ్‌పై చర్చిద్దామంటే పారిపోయారు. నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా రెడీ అని చెప్పా. అయినా పత్తా లేకుండా పోయారు. ఈరోజు జరిగిన ఏసీబీ విచారణలో ఒకటే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగారు. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని నేను వాళ్లను అడిగాను. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు అడిగారు. రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా. నాపై వందల కొద్ది కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడేది లేదని” కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇక ఏసీబీ విచారణకు ముందు.. కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదిలేదన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని వ్యాఖ్యానించారు. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని.. అందుకే ఎన్నిసార్లు విచారణకు పిలిచిన వస్తున్నామన్నారు. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్‌ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్‌ తెలిపారు. కాగా వరుసగా కేసీఆర్ కుటుంబం విచారణలు ఎదుర్కోవటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
Share This Post