భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం హెచ్‌సీయూ (HCU- Hyderabad Central University) భూముల వివాదం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓవైపు విద్యార్థుల ధర్నలు, నిరసనలతో ఉద్రిక్తత నెలకొంటున్న తరుణంలో ఈ వివాదం కాస్త పోలిటికల్ టర్న్ తీసుకుంది. హెచ్‌సీయూ వివాదంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూపై రేవంత్ ప్రభుత్వం (Revanth Govt) అనాలోచితంగా వ్యవహారిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారంపై చీవాట్లు పెడుతున్నా రేవంత్ సర్కార్ తీరు మారదా అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ కోసం పచ్చగా ఉన్న హెచ్‌సీయూలోని అడవులపై సీఎం రేవంత్ దురాగతాలు చేస్తున్నారన్నారు. రాత్రికి రాత్రే బుల్డొజర్‌లతో అడవుల్లోని చెట్లను నరికేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా అక్కడ ఉన్న నోరులేనీ జీవాలు, జంతుజాలాలు కన్నీళ్లతో ఆక్రందనలు చేస్తున్నాయన్నారు. దయచేసి కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఎవరు కొనవద్దని.. ఒకవేళా కొన్న ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని.. దాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద ఈకో పార్క్‌గా మారుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల లాంటిదని.. దీన్ని రక్షించాల్సిన ప్రభుత్వం.. విద్యార్థులు పచ్చని చెట్ల కోసం నిరసనలు చేస్తుంటే, వారిని ‘గుంట నక్కలు’, ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానిస్తోందన్నారు. ఇక ప్రజాపాలన అందిస్తామని చెప్పి.. 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. హమీల అమలు సంగతి అడిగితే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.