Homebreaking updates newsఈ నెల 14న తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి

ఈ నెల 14న తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి

భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ (TTD) కీలక విజ్ఞప్తి చేసింది. శేషాచలం (Seshachalam Hills) కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కుమారధార తీర్థ ముక్కోటి వేడుకలను మార్చి 14న టీటీడీ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి, స్నానమాచరిండాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. కొండ‌మార్గాల్లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా న‌డిచేందుకు టీటీడీ ఇంజినీరింగ్‌, అట‌వీ విభాగాల అధికారులు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే శుక్రవారం ఉదయం 5 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు.. చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్లడానికి అనుమ‌తి నిరాకరించింది. గోగ‌ర్భం నుండి పాప‌వినాశ‌నం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తించనుంది. ట్రాఫిక్ ర‌ద్దీ దృష్ట్యా ప్రైవేట్ వాహ‌నాల‌ను కూడా టీటీడీ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రావాలిని సూచించింది.

ఇకపోతే పాపవినాశనం నుండి కుమార‌ధార‌ తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. అలాగే భక్తుల కోసం మార్గమ‌ధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ఉదయం 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగ‌లి, పులిహోర, సాంబార‌న్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భ‌క్తుల‌కు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనుంది టీటీడీ.

శేషాచలం అడవుల్లో పుణ్యతీర్థాల్లో ఒకటైన కుమారధార తీర్థ తీర్థం వెంకన్న ఆలయానికి వాయువ్య దిక్కులో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పవిత్రమైన తీర్థంలో పవిత్ర స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, కుమారస్వామి ఈ ప్రదేశంలోనే అష్టాక్షర మంత్రాన్ని జపించాడని.. అందుకే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతారు. అంతేకాదు ఈ కుమార తీర్థ ముక్కోటికి సంబంధించి పద్మ, మార్కండేయ, వరహా, వామన పురాణాల్లో కుమారధార తీర్థానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయని భక్తులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments