భారత్ సమాచార్, రాజకీయం : హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారీ ఆంటీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె రోజుకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. వైరల్ కావడంతో ఆమె బండి వద్దకు చాలా మంది జనాలు వెళ్తున్నారు. బండి ముందు పెద్ద క్యూ ఉంటోంది. ఆమెకు జగన్ రెడ్డి ఇల్లు ఇచ్చారని చెప్పించారు. దాన్ని అఫిషీయల్ అకౌంట్ లో సైతం పోస్ట్ చేశారు.
ఏపీలో సెంటు స్థలం ఇచ్చినా అక్కడ బతకడానికి లేకుండా చేశారని సెటైర్స్ కూడా ఈ వీడియోలో పడుతున్నాయి. సెంటు స్థలం, ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదు. స్థలం మాత్రం ఇచ్చారు. ఆ సెంటు స్థలంలో ఇల్లు కట్టలేరు కూడా. అయినా సామాన్యులే తమ బ్రాండ్ అంబాసీడర్లంటూ..ఇలా అందరికీ డబ్బులిచ్చి ప్రమోషన్ చేసేసుకుంటున్నారు. నిజంగా ఆమెకు ఇల్లు ఇచ్చి ఉంటే..ఆ ఇంటి దగ్గరకు పోయి నానా హడావిడి చేసేవారు కదా. కానీ నయానో, భయానో చెప్పించి ఇలా రచ్చ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారీ ఆంటీ హోటల్ ను పోలీసులు మూసివేశారు. దీంతో వైసీపీ, జనసేన మధ్య ట్వీట్ వార్ మొదలైంది. తనకు ఆస్తులు లేవని, కేవలం జగనన్న ఇల్లు ఒక్కటే ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఆ వీడియోను వైసీపీ శ్రేణులు ట్రెండ్ చేశాయి. దీంతో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డితో చెప్పి టీడీపీ కుమారీ ఆంటీ హోటల్ మూసివేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి సమస్యలో ఉన్న మహిళను ఆదుకోవడం మానుకుని ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా? అని జనసేన ప్రశ్నించింది.
ఏదో కష్టపడి పనిచేసుకుని పొట్టపోసుకునే ఇలాంటి సామాన్యులతో పార్టీలు ఇలా రాజకీయం చేయడం ఏంటని జనాలు విస్తుపోతున్నారు. పనిచేసుకుని బతికే వారిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి ప్రచారం చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. దీంతో సామాన్యులకు ఇబ్బందులే తప్ప ఏ ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.