భారత్ సమాచార్, దిల్లీ ; లాల్ కృష్ణ అద్వానీ.. ఈ పేరే ఒక బ్రాండ్. ఎక్కడో 2 సీట్లకు పరిమితమైన బీజేపీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చిన వారిలో అద్వానీ పాత్రే చాలా కీలకం. ఆయన చేపట్టిన రథయాత్ర ఓ వర్గం ఓట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. అది బీజేపీ గెలుపులో మెజార్టీ పాత్రను పోషించింది. ఓటమితో నిరుత్సాహ పడకుండా అద్వానీ అహర్నిషలు విశ్రాంతి లేకుండా శ్రమించారు. ఆయనలోని పోరాట పటిమ, క్రమశిక్షణ వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని చెప్పవచ్చు. అయితే సంఘ్ లో ఆయన చేరిక అనుకోకుండా జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఆత్మకథ ‘మై కంట్రీ మై లైఫ్’లో పేర్కొన్నారు. ఆయనకు కేంద్రం భారతరత్న బహుకరించిన నేపథ్యంలో ఆయన జీవిత విశేషాలు కొన్ని..
- లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న పాకిస్థాన్‍లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. పాక్‍లోని హైదరాబాద్‍లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యలో పట్టా పొందారు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్ కు వలస వచ్చారు.
- తనదైన ప్రసంగాలతో ఆకట్టుకునే అద్వానీకి మొదట్లో అసలు హిందీ వచ్చేది కాదు. భారత్ వచ్చే వరకు హిందీ మాట్లాడేవారు కాదు. హిందీ సినిమాలు చూడడం ద్వారా భాషను అర్థం చేసుకున్నారట. కొంతకాలం వచ్చిరాని హిందీతోనే నెట్టుకొచ్చారట. భారత్ కు వలస వచ్చిన తర్వాతే చదవడం, రాయడం నేర్చుకున్నారట.
- ఆర్ఎస్ఎస్ కు అద్వానీకి ఎంతో అనుంబంధం ఉంది. తన పద్నాలుగేళ్ల వయస్సులోనే ఆయన సంఘ్ లో చేరారు. 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
- బీజేపీ, కమ్యూనిస్టులు ఉప్పునిప్పులా ఉంటారనేది మనకు తెలిసిందే. ఆ రెండు పార్టీల వైరం ఇప్పటిది కాదు. అలాంటి కమ్యూనిస్టులతో జనసంఘ్(బీజేపీ పూర్వ రూపం) అధికారం పంచుకోవడం ఆశ్చర్యమే. 1958లో ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, జనసంఘ్ పోటీ పడ్డాయి. అధికారాన్ని నిర్ణయించగల స్థాయిలో సీపీఐ ఉండేది. సంఘ్ ను దూరం పెట్టేందుకు కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెట్టుకుంది. అరుణా అసఫ్ ఆలీని ఢిల్లీ మేయర్ గా ఎన్నుకుంటేనే మద్దతు ఇస్తామని సీపీఐ ప్రకటించడంతో కాంగ్రెస్ ఒప్పుకుంది. దీంతో అధికార పీఠాన్ని జనసంఘ్ చేజార్చుకుంది. అంతర్గత కుమ్ములాటలతో పొత్తు విడిపోయింది. దీంతో జనసంఘ్ .. సీపీఐతో వ్యూహత్మక పొత్తు కుదుర్చుకుంది. ఈ విషయంలో అద్వానీ కీలకంగా వ్యవహరించారు. అధికారాన్ని పంచుకున్నారు.