భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University)లో ఆందోళనలు (Protest) కొనసాగుతున్నాయి. ఓ వైపు విద్యార్థులు.. మరోవైపు ఆయా పార్టీలు హెచ్‌సీయూలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రూపులుగా ఏర్పడిన విద్యార్థులు విడతల వారిగా హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ (Lathi Charge)చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవి, జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల నిరసనలను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు విద్యార్థులను చితకబాదారు. ఎక్కడికి వెళ్లకుండా తాళ్లతో అడ్డుకుని వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక విద్యార్థులపై లాఠీ ఛార్జ్ జరిగిన అనంతరం రేవంత్ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హెచ్‌సీయూలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు, యూనివర్సిటీ సిబ్బంది మద్దతుగా నిరసన తెలిపేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారాయి.
అలాగే చిన్నపిల్లలు సైతం హెచ్‌సీయూకి మద్దతుగా నిలుస్తున్నారు. హెచ్‌సీయూ అడవుల్లో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని, ఆ అడవులను వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ప్రకటించి జంతువులను, పక్షులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి 6వ తరగతి విద్యార్థి విజ్ఞప్తి చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు కంచ గచ్చిబౌలి భూముల్లో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.