భారత్ సమాచార్, రాజకీయం : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన నేతలు అందరూ ఓడిపోయారు. అర్వింద్, బండి సంజయ్, రఘునందన్ రావుతో పాటు ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఈ నేతలందరూ ఇక లోక్ సభ సమరంలో ఢీకొట్టబోతున్నారు. వీరిలో సంజయ్, అర్వింద్ లు ఎంపీలుగానే ఉన్నారు. వారు తమ తమ స్థానాల నుంచే బరిలో ఉండబోతున్నారు. ఇక రఘునందన్ రావు, ఈటల రాజేందర్ సైతం ఎంపీలుగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడంలో అనూహ్యంగా బీజేపీలో ఆయన పలుకుబడి పెరిగింది. కేంద్ర పెద్దలు కూడా ఆయన్ను ప్రశంసించారు. ఇక తనకు తిరుగులేదనుకున్నా.. ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గంతో పాటు కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా గజ్వేల్ నుంచి సైతం పోటీ చేశారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ను ఓడించిన తనకు సీఎం పదవి వస్తుందని ఆయన బలంగా నమ్మారు. రెండు చోట్ల గెలిచి బీజేపీలో తానే బలమైన నేతను అని కేంద్ర పెద్దలకు చాటిచెప్పాలని అనుకున్నారు. విధివశాత్తు ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.
మరో ఐదేండ్ల దాక జనాల్లో ఉండాలంటే యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలని ఆయన భావిస్తున్నారు. పార్టీలో పట్టు పెంచుకోవాలన్న, కేంద్ర పెద్దల్లో మరింత పలుకుబడి సాధించుకోవాలన్న తక్షణం ఎన్నికల రాజకీయంలోకి దిగాల్సిందే. అందుకే ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మల్కాజిగిరి లేదా మెదక్ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ రెండింటిలో పార్టీ పెద్దలు ఏ నియోజకవర్గంలో పోటీ చేయమన్నా ఆయన ఓకే చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన ఈటలకు లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.