భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు మొత్తానికి ఆమోదం లభించింది. బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు జరిగిన చర్చల అనంతరం వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గంటలు దాటే వరకూ చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా దీనిపై ఓటింగ్ నిర్వహించారు. సభలో 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకించారు.
ఎన్డీఏకు మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయు, శివసేన, లోక్ జనశక్తి పార్టీలు మద్దతునిచ్చాయి. ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను ప్రకటిస్తూ ప్రతిని చింపేశారు. వైఎస్ఆర్సీపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఇక గురువారం ఈ వక్ఫ్ సవరణ బిల్లు చర్చ, ఆమోదం కోసం రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు.
అంతకుముందు లోక్‌సభలో వాడీ వేడిగా చర్చ జరిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం మిగతా పార్టీల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం ఎన్డీయే కూటమి తిప్పికొట్టింది. హోంశాఖ మంత్రి అమిత్ షా, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజులు గట్టిగా బదులు ఇచ్చారు. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. లోక్‌సభలో ఇంత సుదీర్ఘంగా చర్చ జరగడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై ఢిల్లీ, భోపాల్‌లోని ముస్లిం మహిళలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. మోడీ జీ మీరు పారాడండి.. మేము మీ వెంటే ఉన్నాం అంటూ నినాదాలు చేస్తూ.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు భోపాల్ మహిళలు. ఇక ఢిల్లీలోనూ ముస్లిం మహిళలు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ముందుకు వచ్చారు. వారు ప్లకార్డులు పట్టుకుని, “వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని నిజమైన యజమానులకు అందించినందుకు, వక్ఫ్ బోర్డులో మహిళలు, వెనుకబడిన ముస్లింలకు వాటా కల్పించినందుకు మోదీ జీకి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
Share This Post