భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కలియుగ దైవంగా భావిస్తారు భక్తులు. ఆపదలో ఆదుకునే ఆ ఆపదమొక్కులవాడి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎటూ చూసిన ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అటువంటి ఈ క్షేత్రంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వింత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. రీల్స్ మాయలో పడి గుడి.. బడి అని మరిచి వాళ్లకి నచ్చినట్లు చేస్తున్నారు.
పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇలా వెకిలి చేష్టలు చేస్తూ ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోను ఇలాంటి ఘటనలు చోటుచేసున్నాయి. శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో కొంతమంది ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయమై టీటీడీ దృష్టికి వచ్చింది. పవిత్రమైన తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ఘటనలు చోటుచేసుకోవడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఎవరైనా రీల్స్ చేసిన, లేదా వీడియోలు చిత్రీకరించిన కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి చేష్టలు చేయడం అనుచితమని మండిపడింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని.. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోందని హెచ్చరించింది.