భారత్ సమాచార్.నెట్, గుంటూరు: కొల్లిపర పోలీసులు గంజాయి విక్రేతలతో పాటు వినియోగదారులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం 13మందితో కూడిన గంజాయి ముఠాను పట్టుకున్న తెనాలి పోలీసులు, వారి విచారణలో మరికొంత మంది సభ్యులున్నట్లు గుర్తించారు. ఈ సమాచారంతో దర్యాప్తు కొనసాగించి, కొల్లిపరకు చెందిన శోభన్‌బాబు, రుషిబాబు, రాజ్‌కుమార్, శశికుమార్, ఆదిత్య, ఆనంద్ కిషోర్, మంగళగిరికి చెందిన నిఖిల్ కుమార్ (మొత్తం ఏడుగురు)తో పాటు, వారి వద్ద గంజాయి కొనుగోలు చేసిన శ్రీను, గోపినాథ్, ప్రవీణ్, చేతన్ (కొల్లిపర), రోహిత్‌నాగ్ (రేపల్లె), సత్యసాయి చక్రవర్తి (విశాఖ) (మొత్తం ఆరుగురు)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చివరి ఇద్దరు ప్రైవేటు విశ్వవిద్యాలయ విద్యార్థులు కావడం గమనార్హం. నిందితుల్లో ఏడుగురిపైనా, వినియోగిస్తున్న వారిలో ఇద్దరిపైనా గతంలోనూ కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయించినా, వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరిన్ని కథనాలు