August 2, 2025 9:54 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దేనీకి సంకేతం..?!

భారత్ సమాచార్.నెట్: అధికారంలో ఉన్నవి మూడు రాష్ట్రాలు. కొత్త రాష్ట్రాల్లో పాగా వేయాలంటే.. ముందుగా ఉన్న వాటిని చేజారిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్‌తో పాటు.. దక్షిణాన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటనే లేదు.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుందన్నది వాస్తవం. ఎంతలా అంటే.. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూడా వెనుకాడేంత.

 

ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. అనుభవలేమి పాలన.. మాటల్లో డొల్లతనం.. పార్టీలో, ప్రభుత్వంలో మితిమీరిన ప్రజాస్వామ్యం వంటి అంశాలతో.. రాష్ట్రంలో పాలన గాడితప్పినట్లు అనుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు వచ్చిన మీనాక్షీ నటరాజన్.. ఇటీవల ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా భాగం అవుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల పాటు పాదయాత్ర ప్రారంభించారు. అసలు ఎందుకు ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు..? క్షేత్రస్థాయిలో వ్యతిరేకతను అంచనా వేయడానికేనా..? పాదయాత్ర తర్వాత అనూహ్యం నిర్ణయం ఏదైనా ఉంటుందా..? ఇప్పుడు తెలుసుకుందాం..

 

మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర ఎందుకు..?

 

ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకు, క్షేత్రస్థాయిలో ప్రజలను ఏకం చేసేందుకు ప్రతిపక్ష నాయకులు పాదయాత్రను ఓ అస్త్రంలా వాడుకుంటాయి. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయ్యింది. అధికార పార్టీ వ్యవహారాలు చూసే మీనాక్షీ నటరాజన్.. పాదయాత్ర చేపట్టారు. ఆమె పాదయాత్ర ప్రభుత్వంలో, పార్టీలో ఎన్నో ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయ్యింది. ఇప్పటికే పలు అంశాల్లో ఆమె నేరుగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఇటీవల సిగాచీ పరిశ్రమ పేలుడు ప్రాంతాన్ని ఆమె స్వయంగా వెళ్లి పరిశీలించారు. అంతేకాకుండా.. HCU భూముల అంశం, లగచర్ల ఘటనపై కూడా పార్టీ నేతలు, మంత్రులతో నేరుగా సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు.

 

అసలు మీనాక్షీ నటరాజన్ తెలంగాణ బాద్యులుగా రావడమే ఓ సంచలనంగా చెబుతారు. ఆమె కచ్చితంగా అధిష్టానం పంపిన దూతగా అభివర్ణిస్తారు. రేవంత్ పనితీరును, నాయకత్వ లక్షణాలను, పార్టీకి, ప్రజలకు మధ్య సంబంధాలను అంచనా వేసేందుకు ఆమెను పంపించారనే చర్చ జరిగింది. అన్నింటికీ మించి.. తెలంగాణలో అధికారం చేపట్టాక రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఒకే ఒక్కసారి అదీ.. అధికారిక పర్యటన తప్ప.. మరోసారి రాలేదు. పై పెచ్చు.. రేవంత్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న వాదనా ఉంది. చాలాసార్లు ఢిల్లీ పర్యటన చేస్తున్న రేవంత్ రెడ్డికి.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదు. దీంతో రేవంత్‌కు, రాహుల్‌ గాంధీకి మధ్య దూరం పెరిగిందని.. తెలంగాణ సీఎంపై పార్టీ హైకమాండ్ సంతృప్తికరంగా లేదనే వాదనలు వినిపించాయి.

 

ఇటీవలే ఢిల్లీలో.. కులగణనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సందర్భంలో.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. హైకమాండ్‌కు తాను వీర విధేయుడినని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పొచ్చు. సోనియాగాంధీ లేఖను చూపించి.. ఇది తనకు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుతో సమానం అని ఉబ్బితబ్బిబ్బైపోయారు. అలాగే రాహుల్ ఆలోచనలను రాష్ట్రంలో అమలు చేయడానికే తాను ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఆ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర ప్రకటన వెల్లడి కావడం.. కలకలం రేపింది.

 

రేవంత్ రెడ్డికి చెక్ పెడతారా..?

 

అంతర్గతంగా సీఎం రేవంత్‌ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసమే అధిష్ఠానం మీనాక్షి నటరాజన్‌తో పాదయాత్ర చేయిస్తున్నదనే సంకేతాలను ఆ పార్టీ నాయకులే ఇస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం, ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోకపోవడం, కేవలం ప్రతిపక్షాలపై బూతులు, పంచ్‌లతో దాడి చేయడం తప్ప.. నిర్మాణాత్మకమైన ప్రకటనలు చేయకపోవడం, అధికారంలోకొచ్చి యేడాదిన్నర దాటుతున్నా.. చేసిన పనుల్లో చెప్పుకోదగ్గవి లేకపోవడం, ముఖ్యంగా రైతుభరోసా, రుణమాఫీ విషయంలో రైతుల్లో వ్యతిరేకత రావడం వంటి అంశాలు.. రేవంత్ రెడ్డిని కునుకుతీయనివ్వడం లేదు. ఇటు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలతో పార్టీ అస్థవ్యస్థంగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర అంతిమంగా ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది.. అటు పార్టీలో, ఇటు ప్రజల్లో అతిపెద్ద చర్చగా మారింది.

Share This Post